రిబ్కా వంటి సాక్ష్యము నీకుందా? | Telugu Christian Messages | TCS News

రిబ్కా వంటి సాక్ష్యము నీకుందా?
Telugu Christian Messages
(ఈ సందేశాన్ని అమ్మాయిలు తప్పక చదివి మీ స్నేహితులకు షేర్ చేయండి)

రిబ్కా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు

ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు (ఆదికాండము 24: 16)

రిబ్కా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె కన్యక అని, ఏ పురుషునితో సంబంధాలు పెట్టుకోలేదు అని సాక్ష్యము ఇస్తున్నాడు…… ఈ రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు ఇలాంటి సాక్ష్యాన్ని కల్గి ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మీ గురించి ఈ రకంగా సాక్ష్యం చెప్తున్నాడా?

కొంతమంది అమ్మాయిలు ఇట్టి రకమైన సాక్ష్యాన్ని కోల్పోతున్నారు….వివాహం కంటే ముందే ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరుగుతూ లైంగిక సంబంధాలు పెట్టుకొంటున్నారు కొందరు యవనస్థులు…..కొన్ని రోజుల తరువాత ఏవో కొన్ని కారణాలు చెప్పి విడిపోయి మరో వ్యక్తి ని వివాహం చేసుకొంటున్నారు…. ఇది ‘”మహ ఘోర పాపం” ఇలాంటవారందరు కూడా సాక్ష్యాన్ని కోల్పోతున్నారు…
దేవుని వాక్యం సెలవిస్తుంది

వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను (హెబ్రీ 13: 4)

పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటున్నాడు…అనగా వివాహం కంటే ముందు వేరే వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అని అర్థం..

కాని ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు వివాహం కంటే ముందే వేరే వ్యక్తిని ప్రేమించి తమ శరీరాన్ని , హృదయాన్ని సమర్పించేసుకొని తరువాత ఏవో కొన్ని కారణాల చెప్పి విడిపోవడం, లేదా నమ్మించి మోసం చేసాడని బాధపడుతున్నారు …వివాహ సమయం వచ్చినప్పుడు ఈ విషయం నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని రోధిస్తున్నారు…ఎంత దారుణమైన పరిస్థితి ఇది.
వీరు ముందుగానే దేవుని వాక్యాన్నికి లోబడి వారి శరీరాన్ని కాపాడుకొని ఉంటే ఈ రోజు అలాంటి పరిస్థితి వచ్చేది కాదు…ఈ రోజు వారు చేసిన పాపములో బంధించబడ్డారు (సామెతలు 5:22)

ఇప్పుడు దేవుడు వీరిని క్షమించలేడా అంటే?హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడితే క్షమించగలడు…కాని శిక్షిస్తాడు కూడా(కొన్ని సందర్భాలలో)

దేవుడు క్షమించగలడు కాని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి/భర్త క్షమించాలి కదా? (దయచేసి బైబిలు తెరచి సామెతలు 6:29-35 వచనాలు చదవండి)

కనుక ప్రియమైన సహోదరిణిలారా క్రీస్తు నందు మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను…అలాంటి పనులు చేసి దయచేసి మీ జీవితాన్ని చిక్కుల్లో పెట్టుకోకండి…కొన్ని తప్పులను సరిదిద్దుకోలేము(ముఖ్యంగా లైంగికత విషయాలు)
జీవితాంతం వెంటాడుతుంటాయి…దావీదు మహరాజు కూడా లైంగికత విషయాలలో ఒక తప్పు చేసాడు.. పరాయి స్తీని(భార్యని) ఆశించి దేవుని శిక్షకు గురి అయ్యాడు….జీవితంలో శాంతి సమాధానం కోల్పోయాడు ( దయచేసి 2 సమూయేలు 12:10-15 వచనాలు చదవండి)

దేవుని వాక్యం సెలవిస్తుంది

నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము(సామెతలు 5:18)

అనగా స్త్రీ కి ఈ వాక్యాన్ని అన్వయించుకొంటే “నీ యౌవనకాలపు భర్త యందు సంతోషింపుము అని అర్ధం”
అంతవరకు నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో…నీ శరీరం దేవుని ఆలయమై ఉంది..ఆ శరీరంతో దేవుని మహిమపరచు (1 కొరింథీ 3:16,17 ; 6: 19,20)
అంతేకాని నీ దేహాన్ని ప్రేమ పేరుతో స్నేహం పేరుతో వేరే వ్యక్తికి అప్పచేప్పేసుకొని కన్యాత్వాన్ని కోల్పోయి జీవితాన్ని చిక్కుల్లో పెట్టుకుని , ఒక ప్రక్క తల్లిదండ్రులను తల దించుకొనేలా ,మరో ప్రక్క దేవుని నామాన్ని అవమానపాలయ్యేలా చేయకండి

కొంతమంది అబ్బాయిలు తమ కోరికలు తీర్చుకోవడం కోసం చెప్పే మాయ మాటలకు పడిపోకు
వారు చెప్పే డైలాగులకు(నీ కోసం మారుతా, నీ కోసం ఏమైనా చేస్తా..నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో…..మొదలైనవి)
మరియు ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ (నీ కోసం చస్తా, నీవు ప్రేమించకపోతే డైలీ మందు త్రాగుతాను, నీవు మాట్లడకపోతే భోజనం చేయను)
ఇలాంటి ఎమోషనల్ డైలాగ్స్ కు పడిపోయి నిర్ణయాలు తీసుకోవద్దు
ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఒకడు చెడ్డవాడు అని తెలిసి మొదట దూరం పెట్టినప్పటికి తరువాత పైన చెప్పినటవంటి మాటలకు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ కు పడిపోయి ప్రేమలో పడుతున్నారు… కొన్ని రోజులకు వాడు మంచివాడు కాదని, జీవితం నాశనం అయిపోయిందని ఏడుస్తున్నారు…
ప్రేమించినప్పుడు తెలీదా అంటే? తెలుసు కాని వాడు చెప్పే మాటలకు పడిపోయాము అంటారు

తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. (1 కోరింథీ 10:12)

నా ప్రియ సహోదరి ఎమోషనల్ అయిపోయి , జాలి పడి నిర్ణయాలు తీసుకోవద్దు..ఎమోషన్(భావోద్వేగం) కొద్ది సేపే ఉంటుంది…ఆ సమయంలో తీసుకొనే నిర్ణయాలు చాలా నష్టాన్ని కల్గిస్తాయి
ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి…దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి…అలాంటి శోధనలు ఎదురైనప్పుడు జయించగలరు

మరికొంతమంది అమ్మాయిలు అయితే ప్రేమ పేరుతో సంవత్సరానికి ఒకరితో తిరుగుతుంటారు.వీరి జీవితంలో 4,5 బ్రేక్ ఆప్ ప్రేమ కథలు ఉంటాయి..వీరందరు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు. వీరందరని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు..ఇప్పటికైనా మారుమనస్సు పొందండి (సామెతలు 2:13-17; 14:14 వచనాలు చదవండి)

మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును (సామెతలు 15: 10)

మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి (యెహేజ్కేలు 18: 31)

ఇంకా కేవలం శరీరాన్ని సమర్పించడము మాత్రమే పాపము కాదు…మన హృదయాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి… (సామెతలు 4:23)
మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు స్నేహం పేరుతో హద్దులు దాటి మాట్లడటం, భార్య భర్తల లాగా గొడవ పడటం చేస్తున్నారు…ప్రేమించుకొంటున్నారా అంటే కాదు స్నేహం అంటారు… కాని మాటలు , చేష్టలు అలా ఉండవు..సరసమైన మాటలు మాట్లడటం, వీడియో కాల్స్ చేసుకోవడం, మాట్లడరాని మాటలు మాట్లడుకొంటూ దానికి best friendship అని పేరు పెట్టి హృదయంతో అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు.. (సామెతలు 15:11 ; 22:12 ; 10:19 ; 4:24 ; 6:12 ; 15:26,28 ; మత్తయి 15:18,19)
ఒకవేళ ఇలాంటి స్నేహలు చేస్తుంటే వాటినే ఈ క్షణమే విడిచిపెట్టి ప్రభువు తట్టు తిరగండి

జాలిపడి స్నేహం చేయడం, కొందరు చెప్పే మాయ మాటలకు పడిపోయి సాతాను ఆధీనంలోకి వెళ్లిపోమాకు (1 తిమోతి 5:15)

లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. (ప్రసంగి 11: 10)

ఒక వేళ వివాహం చేసుకోవాలి అనుకొంటుంటే సరియైన జీవిత భాగ్యస్వామిని అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించండి కనిపెట్టండి…దేవుడు మీకు మార్గం చూపిస్తాడు

అంతవరకు మీ కన్యాత్వాన్ని కాపాడుకోండి…వివాహం కంటే ముందే కన్యాత్వాన్ని కోల్పోయి పైన చెప్పినట్లుగా చిక్కులలో పడి జీవితాన్ని నాశనం చేసుకోకండి…
“”””ఈ రోజు అలా వివాహం కంటే ముందే కన్యాత్వాన్ని కోల్పోయి కొంతమంది జీవితాంతం నరకయాతన అనుభవిస్తున్నారు.. మరికొందరు గతంలో చేసిన తప్పు ఎక్కడ బయటపడతాదో తమ భర్త కు తెలుస్తాదో అని భయపడుతు బ్రతుకుతున్నారు”””””” దయచేసి అలాంటి స్థితికి నీవు చేరుకోమాకు…అది బహు నరకం…కనుక కన్యకగా ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి.

దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. (ప్రసంగి12:1,2)

రిబ్కా చాలా చక్కనిది అని వాక్యం సెలవిస్తుంది… కనుక తనను కొంతమంది పురుషులు ఆశించి ఉండే అవకాశం ఉంది…ప్రేమ పేరుతో కొందరు వెంటపడే అవకాశం ఉంది…అయినప్పటికీ పురుషులను దూరంగా ఉంచి తన కన్యాత్వాన్ని కాపాడుకొంది..అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె కన్యక ఆమె ఏ పురుషుడును కూడలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు…ఇట్టి రకమైన సాక్ష్యాన్ని ప్రతి ఒక్క అమ్మాయి కల్గి ఉండాలి

అలా ఉండాలి అంటే ఈ పాపలోకంలో పడిపోకూడదు…పడిపోకూడదు అంటే దేవునితో ఎక్కువగా సహవాసం చేయాలి..కనుక

  • ప్రతిదినం దేవుని వాక్యం చదువుతూ మన నడతను పరిశీలించుకోవాలి (కీర్తన 119:9)
  • ప్రార్థన జీవితం కల్గి ఉండాలి…పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రార్థించండి (మత్తయి 26:41, లూకా 11:13, అపొ”కా 1:8, రోమా 8:13 )

ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు. (రోమా 8:13)

  • సంఘ కార్యక్రమాలలో చురకగా పాల్గొంటూ దేవుని పరిచర్యలో పాలిభాగస్థురాలిగా ఉండాలి (1 కొరింధీ 16:15 ; హెబ్రీ 10:24,25 ; తీతు 2:3-5 ; అపొ” కా 2:42)
  • ఆత్మీయులతో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి..ఎందుకంటే ఆత్మీయులు దేవుని మాటలు ఆధికంగా మాట్లాడుతారు…దారి తప్పినప్పుడు వాక్యం ద్వారా గద్దించుటకు, గందరగోళంలో ఉన్నప్పుడు వారు మనకు ఆలోచనకర్తలుగా ఉంటూ సహయపడుతారు…(సామెతలు 10:31,32 ;11:14 ; 15:28 ; 17:17 ; 27:6 ; అపొ” కా 2:42)

ఇట్టి రకంగా జీవించడం క్షేమకరం

యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును (సామెతలు 31:30)

చివరిగా ప్రభువా నేను ఈ పాపలోకంలో పడిపోకుండా నన్ను కాపాడు, నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియజేసి ఆ ప్రణాళికలో నన్ను నడిపించు…ప్రేమ/స్నేహం పేరుతో మోసపోకుండా, ఈ శరీరంతో నీకు విరోధంగా అపవిత్రమైన కార్యాలు చేయకుండా “రిబ్కా వంటి సాక్ష్యాన్ని నేను కూడా కలిగి ఉండుటకు సహయం చేయు తండ్రి అని ప్రార్థించండి”

అట్టి రకమైన జీవితాన్ని మీ అందరికి దేవుడు అనుగ్రహించును గాక…ఆమెన్
Ribka bible Telugu Christian Messages

written by : Telugu Christian Messages Page

Leave a Reply